Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో వరుసగా రెండోసారి బుధవారం ఢిల్లీ శాసనసభకు బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేఖా గుప్తా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు.. మంగళవారం కూడా శాసనసభకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. తెల్లవారుజామున అసెంబ్లీ ప్రాంగణంలో బాంబులు అమర్చినట్లు స్పీకర్ అధికారిక ఈమెయిల్ ఐడికి దుండగలు బెదిరింపు ఈమెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది.

బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, చుట్టుపక్కల తనిఖీలను ముమ్మరం చేశాయి. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు ఈమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయని వెల్లడించారు.