
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, దివంగత షేన్ వార్న్ కుటుంబాన్ని అదృష్టం వరించింది.
ఐపిఎల్ ఆరంభ ఎడిషన్‌లో (2008) రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్న్ సారథ్యంలో తొలి సీజన్‌లోనే రాజస్థాన్ కప్ గెలిచింది. అయితే వార్న్‌కు కెప్టెన్సీ బాధ్యతలే కాకుండా జట్టుకు ఆడినంత కాలం ఏటా 0.75 శాతం యాజమాన్య వాటాను కూడా కేటాయించారు. వార్న్ మొత్తం నాలుగు సీజన్లు ఆడాడు. దీంతో అతడికి 3 శాతం వాటా లభించింది. ఈ నేపథ్యంలో వార్న్ కుటుంబం ఆ వాటాలను విక్రయించగా ద్వారా సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.460 కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందానికి బిసిసిఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.