
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 28న జరిగే మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతోంది. కాగా, ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో అతని స్థానంలో భారత యువ సంచలనం ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. కమిన్స్ గెర్హాజరీలో ఇషాన్ జట్టును నడిపించనున్నాడు. అయితే విపరీత పోటీ ఉండే ఐపిఎల్‌లో జట్టును ముందుండి నడిపించడం అనుకున్నంత తేలికేం కాదు. కమిన్స్‌తో పోల్చితే ఇషాన్ అనుభవం అంతంత మాత్రమే.
ఇలాంటి స్థితిలో ఇషాన్ తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన నాయకత్వం ప్రతిభతో జార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. బ్యాట్‌తో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేయి పోయాడు. అంతేగాక సారథిగా కూడా సత్తా చాటాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్‌ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగే ఐపిఎల్‌లో జట్టును విజయపథంలో నడిపించడం చాలా కష్టంతో కూడుకున్నఅంశం. కానీ ఇషాన్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న హైదరాబాద్ ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగనుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లు సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్నారు. దీంతో హైదరాబాద్ కూడా ఐపిఎల్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.