
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకొని అపురూప మార్క్సిస్ట్ మేధావిగా రూపుదిద్దుకున్న ‘ఆదర్శ కమ్యూనిస్టు’ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి. ఆయన ఒక సాధారణ కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగి, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, నవచరిత్రని సృష్టించి, మేరు శిఖరంగా నిలిచారు. ‘మార్క్సిజం వెలుగులో ఎర్రజెండా నీడ’లో అంతిమ శ్వాస వరకు ఎత్తిన జెండా దించకుండా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒకే పార్టీలో కొనసాగి ఎందరికో ఆదర్శప్రాయుడుగా నిలిచారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాకుండా అంతర్జాతీయం గాను కూడా ఆయన అనేక ప్రజాపోరాటాలలో గొంతులేనివారి గొంతుకగా ఉద్యమించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడేరు మండలంలో గల కొండ్రావుపల్లి గ్రామంలో సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1942 మార్చి 25 నాడు ప్రథమ సంతానంగా జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి నుండి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు.
గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, పెదనాన్న అయిన సురవరం ప్రతాపరెడ్డి కొనసాగించిన సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను ఆయన అనుసరించారు. స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలం కంచుపాడుపై ఉన్న మమకారంతో ఆయన తన తండ్రి వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎందరినో విజ్ఞానవంతులుగాను, ఆదర్శవంతులుగాను తీర్చిదిద్దారు. సురవరం సుధాకర్‌రెడ్డి చిన్ననాటి నుండి ఆదర్శ భావాలతో నడుచుకునేవారు. విద్యార్థి – యువజన నాయకుడిగా ఆయన అనేక సమస్యల పరిష్కారాల కోసం ఉద్యమించి క్రమంగా భారత కమ్యునిస్టు పార్టీలో చేరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి రెండుసార్లు నల్గొండ నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారాల కోసం ప్రజాగొంతుకగా నినదించారు. సురవరం సుధాకర్‌రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడుసార్లు ఎన్నికై సరికొత్త చరిత్రను సృష్టించారు. చండ్రరాజేశ్వర రావు తరువాత సి.పి.ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం సుధాకర్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన పార్లమెంట్ సభ్యులుగా కొనసాగిననూ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిననూ కూడా తనను అతి సామాన్యమైన వ్యక్తిగానే భావించుకున్నారు.
భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డి తొలిసారిగా కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో మిగులు భూములపై భూపోరాటంలో పాల్గొన్నారు. క్రమంగా ఆయన అనేక జిల్లాలో అనేక భూపోరాటాలలో పాల్గొని పేదలకు అండగా నిలిచారు. విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెట్టుబడిదారీ -సామ్రాజ్యవాద విధానాలను సురవరం సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాల ద్వారా తీవ్రంగా నిరసించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్యంతో ఉన్నా కూడా అంతిమ శ్వాస దాకా పార్టీ ఆశయాల కోసం ఆయన పరితపించారు. ఆదర్శాలు చెప్పడం వేరు. ఆ ఆదర్శాలను కడదాకా ఆచరించి ఆదర్శంగా నిలవడం వేరు. ముఖ్యంగా ‘తాము ఆదర్శ కమ్యూనిస్టులం’ అని గొప్పలు చెప్పుకుంటూనే పెట్టుబడిదారీ లక్షణాలను ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వారెందరో ఉన్నారు.
కాని వారిలో ఆదర్శ కమ్యూనిస్టు లక్షణాలు ఏ ఒక్కటి కూడా లేకపోవడం చాలా సృష్టంగా తేటతెల్లం అవుతూనే ఉంటుంది. కాని కొందరు కమ్యూనిస్టులు మాత్రమే ఆ ఆదర్శాలను కడదాకా ఆచరించి భావి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. ఆ కోవలోనే సురవరం సుధాకర్‌రెడ్డి ‘ఆదర్శ కమ్యూనిస్టు’ గాను నిలిచారు. సురవరం సుధాకర్‌రెడ్డి తన జీవితాన్ని మొత్తం కష్టజీవులకు అంకితం చేసి వారి కష్టాలతో సహవాసం చేశారు. ‘అసమానతలు లేని సమాజం ఆవిష్కరింపబడాలి’ అని ఆయన బలంగా ఆకాంక్షించారు. ఆ ఆశయ సాధన కోసమే ఆయన అనుక్షణం ఆరాటపడేవారు. ఆయన అనేక సవాళ్లను అధిగమించి సాధారణస్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదిగిననూ కూడా అతి సాధారణ జీవితాన్ని గడిపి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్రవేసిన సురవరం సుధాకర్‌రెడ్డి 2025 ఆగస్టు 22 నాడు మరణించారు.
ఆయన మరణించిననూ నిప్పురవ్వలై ఎగిసే ప్రతి ప్రజా పోరాటంలోనూ ఆయన ‘ఉదయించే సూర్యుడు’లా వెలుగుచూస్తూనే ఉన్నారు. ఆయన మరణం కష్టజీవులకు, భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన కోరిక మేరకు పరిశోధనల నిమిత్తం పార్ధీవ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేయడం తద్వారా ఆయన చావు అనంతరం కూడా ప్రజాసేవకు అంకితం చేయబడడాన్ని సమున్నతంగా ఎత్తిపడుతుంది. చివరి క్షణం వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగిన సురవరం సుధాకర్‌రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయుడుగా నిలిచి భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించుకున్నారు. అంతిమంగా చండ్ర రాజేశ్వరరావు అడుగుజాడలలో పురోగమించిన సురవరం సుధాకర్‌రెడ్డి భావితరాలకు ‘ఆదర్శ కమ్యూనిస్టు’ గాను వెలుగొందుతూనే ఉంటారు.
(నేడు సురవరం సుధాకర్‌రెడ్డి జయంతి)
జె.జె.సి.పి. బాబూరావు