Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు ఐజి ఎస్ ఎస్ త్రిపాటి వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా రెండు గ్రూపులు ఐక్యూఐఎస్, ఐసిస్ పేర్లతో నిందితులు గ్రూపు ఏర్పాటు చేసుకొని తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒక గ్రూపులో ఐదుగురు మరో గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి పోస్టింగ్స్ పెడుతున్నట్లుగా తెలియజేశారు. ముగ్గురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని,  తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతను ఆకర్షించడమే వీరి లక్ష్యామని తెలియజేశారు. ఈరోజు అరెస్టయిన ముగ్గురు విజయవాడకు చెందిన వాళ్ళేనని, ప్రస్తుతం ఆయా గ్రూపులలో ఉన్న వాళ్ళంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉన్నారని, డబ్బుల కోసం పని చేస్తున్నారా లేక మరేదైనా కారణం చేత పని చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి త్వరలోనే మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని ఐజి  స్పష్టం చేశారు.