
మన తెలంగాణ/హైదరాబాద్: జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యాభై శాతం సీట్లు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం వెనుక కుట్రపూరితమైన దురుద్దేశం ఉందని ఆయన విమర్శించారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం గా ఉండాలని, నియోజకవర్గాల పునర్విభజనపై పోరాటానికి సన్నద్ధం కావాలని ఆ యన పిలుపునిచ్చారు. మంగళవారం సా యంత్రం ఢిల్లీలో ఓ టివీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ము ఖ్యమంత్రి ఘాటైన సమాధానలిచ్చారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హయాంలో దక్షిణాది రా ష్ట్రాల పట్ల వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడకుండానే
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికే యాభై శాతం సీట్లు పెంచాలని కేంద్రం కుట్ర చే సిందని ఆయన విమర్శించారు. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే సీట్లు పెరగనున్నాయని ఉదహరించారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన వివరించారు. కేరళ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేయనున్నారా? అని ప్రశ్నించగా, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా ప్రచారానికి వెళ్లి చెబుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుని, ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పడంలో అర్థం లేదని ఆయన విమర్శించారు.
వెంకయ్యను రాష్ట్రపతి చేయలేదు..
కేంద్ర మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్ తప్ప ముఖ్యమైన పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు. కేంద్ర హోం శాఖను దక్షిణాదికి ఎందుకు కేటాయించలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న ఎం. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి చేయకుండా హైదరాబాద్‌కు వెనక్కి ఎందుకు పంపించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ స్పీకర్, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిని ఆరవ వేలుగా చూస్తున్నారని, ఈ రాజకీయ వివక్ష బిజెపిలో ఉందని ఆయన విమర్శించారు.
ప్రధాని మోడీ దేశానికి బ్రాండ్..
ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలే తప్ప కేవలం గుజరాత్‌కే ఉండరాదన్నారు. గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా, ఎక్కడ మంచి నిర్ణయాలు జరిగితే వాటిని ఆచరించడంలో తప్పేమి లేదన్నారు. బ్రిటీషు వాళ్ళు మన దేశానికి స్వాతంత్య్రం అప్పగించి వెళ్ళిపోయినా భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఉదహరించారు. అదేవిధంగా సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలనకు తమ రాష్ట్రం నుంచి పలువురు ఎంపీలను, అధికారులను పంపించానని ఆయన చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్‌ను బిజెపి వ్యతిరేకిస్తున్నదని ఆయన విమర్శించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు సుమారు డ్బ్బై అయిదు కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పేదల కష్టాలు నాకు తెలుసు..
ఎన్నికలకు ముందు తాను పాదయాత్ర చేశానని, ఈ సందర్భంగా ఆదివాసీలు, పేదల కన్నీళ్ళు, కష్టాలు చూశానని ఆయన తెలిపారు. వారి కష్టాలు తీర్చే విధంగా తమ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి, తమకు అప్పగించిందన్నారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు తాము శ్రమిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
విలన్ వల్లే తనకు గుర్తింపు..
తాను నాయకుడిని కాదు కార్యకర్తనని ఆయన తెలిపారు. కార్యకర్తలతో మిత్రుడిలా ఉంటానని, అందుకే వారంతా తానంటే ఇష్టపడతారని ఆయన చెప్పారు. రావణుడు ఉన్నందుకే రామునికి గుర్తింపు వచ్చిందని, ధుర్యోధనుడు ఉన్నందుకే పాండవులకు గుర్తింపు వచ్చిందని, అదే విధంగా రాష్ట్రంలో విలన్లు ఉన్నందుకే తనకు గుర్తింపు వచ్చిందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నట్లు ఇప్పుడు తామూ పదేళ్ళు అధికారంలో ఉంటామని, ఇంకా ఎనిమిదేళ్ళు అధికారంలో ఉంటామని ఆయన చెప్పారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.