Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్ర జల జీవితాల్లో మార్పు కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో బడ్జెట్ క్లారిఫికేషన్ సందర్భంగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతుబంధు నిధు లు విడుదల చేసేదని విమర్శించారు. వారిలా మాది ఎలక్షన్ భరోసా కాదని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను, ఉద్యోగులను నిర్బంధించిన వారు, ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వినే ఓపిక లేక సభ నుంచి వెళ్ళిపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తనకు జరిగిన అవమానాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రజల సమస్యల కోసం మైక్ అడిగితే ఇవ్వని వారు, నేడు మేము ప్రతి అంశానికి సమాధానం ఇస్తామన్నా వినకుండా పారిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తమ ఆలోచనలన్నీ ప్రజల అవసరాల చుట్టూనే తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఏదైనా కారణంతో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదన్న ఉద్దేశంతో రూ. 1.20 కోట్ల ప్రమాద భీమా కల్పించామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గతంలో ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి, భయం భయంగా బతికించిన బిఆర్‌ఎస్ నేతలకు ఈ సంక్షేమం ఇష్టం లేకే సభను వీడారని విమర్శించారు. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రావద్దన్న ఆలోచనతో పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ అందించాలని నిర్ణయించామన్నా రు. అంతేకాకుండా, ఇంటర్ విద్యార్థులకు కూడా మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షం బడ్జెట్ కాగితాలు చించి చెవిలో పెట్టుకుని వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెబుతూ, ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, గత ప్రభుత్వంలాగా ఓట్ల కోసం ఔటర్ రింగ్ రోడ్డును కుదువబెట్టి డబ్బులు పంచే సంస్కృతి తమది కాదని హితవు పలికారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. మత, ప్రాంత భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ప్రమాద భీమా కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాల కోసం రూ. 50 వేల కోట్లు కేటాయించామని వివరించారు. వ్యక్తులుగా తాము చిన్నవాళ్ళం కావచ్చు కానీ, తాము చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియను మన్నించి చర్చలో పాల్గొనాల్సింది పోయి, ‘ఆడలేక మధ్యలో ఓడు’ అన్నట్టుగా బిఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు సుదీర్ఘ కాల స్నేహం ఒకే భావజాలంతో పనిచేసిన వాళ్ళం. ఆయన తెలంగాణ రాష్ట్రం వాడిని అని మర్చిపోయి పక్క రాష్ట్రం వాడిని అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ యూనిట్ ధరను పది రూపాయలకు పెంచామని బిజెపి నేతలు ఆరోపించారు.. అది వాస్తవం కాదు మేం అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు పెంచలేదు. మాకు ప్రజల పట్ల అంకితభావం చిత్తశుద్ధి ఉందన్నారు. విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయాలి, విద్యుత్తు ఉత్పత్తికి ఎంత ఖర్చు అయితే అంత వసూలు చేయాలి, విద్యుత్ రేట్లు పెంచకపోతే కేంద్రం నుంచి కావాల్సిన ప్రయోజనాలు ఇవ్వం అని పది సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ప్రయోజనాలు ఇవ్వడం లేదు.

ఏం సబ్సిడీలు ఎత్తివేయం, 200 యూనిట్ల విచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి చీటింగ్ బడ్జెట్ అంటున్నారు మేము ఎవరిని చీట్ చేశాం ఆయన చెప్పాలన్నారు. ఒకాయన బడ్జెట్ పుస్తకాలను చించి చెవిలో పెట్టుకుని పోతే.. మరొకరు చీటింగ్ బడ్జెట్ అంటారు ఇది ఎక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి నేతలు తమతో కలిసి పోరాడడానికి ముందుకు రావాలన్నారు. కేంద్రానికి రూపాయి పంపితే 30 పైసలు తిరిగి ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 62 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 60 పైసలు ఇస్తున్నారు, అదే బీహార్‌కు రూపాయి కడితే 6.69 రూపాయలు ఉత్తరప్రదేశ్ కు 1.96, మధ్యప్రదేశ్ కు 1.87 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు.

తెలంగాణ ఏం పాపం చేసింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగం కాదా మేం డబ్బులు కడితే తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారన్నారు.. బిజెపి నేతలు తెలంగాణ పై స్వారీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని బిజెపి నేతలు గాలి మేడలు అన్నారని, మేము చెప్పడం లేదు ప్రధానమంత్రి 2047 కల్లా 30 త్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు అందులో భాగంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధాని మోడీ చెప్పింది కరెక్ట్ కాదు అని బిజెపి నేతలు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు.