Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 4,473 మంది లబ్ధిదారులకు రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి వారం ఇండ్ల నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో గత వారానికి సంబంధించి రూఫ్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసిన 1,969 మంది లబ్ధిదారులకు రూ.17.23 కోట్లు, స్లాబు పూర్తి చేసిన 2,504 మందికి రూ.31.56 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లక్ష ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశలో ఫలితాలు సాధిస్తున్నామని, ఇప్పటి వరకు రూ.5,376.22 కోట్ల లబ్దిదారులకు విడుదల చేసినట్లు వెల్లడించారు.

ఇంటి నిర్మాణపు పురోగతిని బట్టి విడతల వారీగా లబ్ధిదారులకు ఐదు లక్షలను అంద చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన వాటికి రూ. 2,125.98 కోట్లు, గోడలు పూర్తి అయి రూఫ్ లెవల్ వరకు వచ్చిన ఇండ్లకు రూ.1,518.51 కోట్లు, స్లాబ్ పూర్తి అయిన వాటికి రూ.1,731.73 కోట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్ల పనులు ప్రారంభంగా కాగా, వాటిలో ఇంతవరకు 1,13,365 ఇండ్ల స్లాబు పూర్తి అయ్యిందని, 34,552 ఇండ్లు రూఫ్ లెవల్ (గోడల నిర్మాణం పూర్తి) దశలో ఉన్నాయని, మరో 61 వేల ఇండ్ల బేస్ మెంట్ నిర్మాణాలు పూర్తి అయ్యాయని ఆయన వివరించారు.