Reading Time: < 1 minute

 ఐపిఎల్ సీజన్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఆటగాళ్లు 11 నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్జి 28న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో జట్టు సభ్యులు 11వ నంబర్ జెర్సీని ధరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సిఇఓ రాజేశ్ మేనన్ మంగళవారం వెల్లడించారు. కిందటి ఏడాది బెంగళూరు టీమ్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

వారికి నివాళిగా బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వారి మృతికి సంతాప సూచకంగా స్టేడియంలో 11 సీట్లను రిజర్వ్ చేసి పెట్టనున్నట్టు తెలిసింది. చిన్నస్వామి స్టేఇయడంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా, ఇతర కార్యక్రమాల సమయంలో కూడా ఈ 11 సీట్లు ఖాళీగానే ఉంటాయని సమాచారం. అంతేగాక ఆరంభ మ్యాచ్‌కు ముందు స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆర్‌సిబి యాజమాన్యం నిర్ణయించింది. కాగా, ఈ సీజన్‌లో ఆర్‌సిబి బెంగళూరులో ఐదు మ్యాచ్‌లను ఆడనుంది. రెండు మ్యాచ్‌లు రాయ్‌పుర్‌లో జరుగుతాయి.