
త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంపిణీ చేస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. అదే విధంగా కేజీ పప్పుతో పాటు కిలో వంటనూనె కూడా ఉచితంగా సరఫరా చేస్తామని హామీనిచ్చింది. మంగళవారంనాడిక్కడ ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి, మాజీ సిఎం పళనిస్వామి మేనిఫెస్టో విడుదల చేశారు. రిఫ్రిజిరేటర్లను పంపిణీ చేయడమంటే గృహిణులపై పని భారాన్ని తగ్గించడమేనని పళనిస్వామి అన్నారు. ప్రతి ఏటా మూడు వంటగ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. జల్లికట్టు క్రీడలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇంకా మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు వారికి ప్రతి నెలా రూ.2000 ఆర్థిక సాయం, ఐదు లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్రవాహనాలను సబ్సిడీపై అందజేస్తామని పళనిస్వామి ప్రకటించారు. పింఛన్లను రూ.2000కు పెంచుతామన్నారు. మహిళలకు బస్సులో ఉచితంగా ఇప్పటికే ప్రయాణ వసతి కల్పిస్తున్నారని, దాన్ని పురుషులకు కూడా వర్తింప జేస్తామన్నారు. అధికారంలోకి రాగానే డిఎంకె హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. మేనిఫెస్టోలోమొత్తం 297 హామీలను అన్నాడిఎంకె ప్రకటించింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల 23న పోలింగ్ జరగనుంది.