Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ ల పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు మరియు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) అనే యువకుడు మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు రైల్వే పట్టాలు దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించలేదు దీంతో వేగంగా వచ్చిన రైలు అతడిని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.ఆర్.పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్  రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి స్థానిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంకటేశ్వర్లు మృతితో నర్సిపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.