Reading Time: < 1 minute

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురవగా హైదరాబాద్‌లో వడగండ్ల కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు విపరీతమయిన ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వరుణుడు షాక్ ఇచ్చాడు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షకురవగా, జూబ్లీహిల్స్, బజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో మాత్రం కుంభ వృష్టి కుసిరింది.

మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వడగండ్లు పడటంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరం వెలుపల ప్రాంతాలయిన సూరారం, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లోనే వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. కుండపోతగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. ప్రధానంగా ఐటి కారిడార్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. ప్రజలు ఉద్యోగ, ఉపాధి, కూలీ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం దాటికి నిలిచిన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేసింది.