
న్యూఢిల్లీ: కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ (MNM) రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని కమల్ ప్రకటించారు. అయితే అధికారంలో ఉన్న ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (DMK) నేతృత్వంలోని కూటమికి తమ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ.. “మేము DMK కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. మేము విజయం సాధిస్తాం… నా దార్శనికత గురించి పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. వారు నా ఆశయాలను అనుసరిస్తారు. మేము మధ్యేవాదులం (centrists). మేము ఏ వైపుకూ మొగ్గు చూపమని మాకు తెలుసు” అని అన్నారు.
కాగా.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కమల్ హాసన్, జూన్ 12న DMK కూటమి మద్దతుతో ఏకగ్రీవంగా రాజ్యసభలో అడుగుపెట్టారు. అవినీతి నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తూ.. MNM వ్యవస్థాపకుడు కమల్ హాసన్ 2017లో తన పార్టీని ప్రారంభించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ మొత్తం ఓట్లలో సుమారు నాలుగు శాతం వాటాను దక్కించుకుని, తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అడుగులను బలంగానే వేసింది.
తర్వాత, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో MNM పోటీకి చేయకుండా DMK కూటమికి మద్దతును ప్రకటించింది. ఇదిలావుంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.