
మతం మార్చుకున్న తరువాత అట్రాసిటీ చట్టం కేసులపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులను పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఈ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్‌వీ అంజారియా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి, నేడు తుది ఉత్తర్వులను జారీ చేసింది.బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిని నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటే రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
చింతాడ ఆనంద్ పాస్టర్‌గా పనిచేస్తున్నందు వల్ల క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో అతను షెడ్యూల్ కులానికి చెందరని కోర్టుకు విన్నవించుకున్నారు. అట్రాసిటీ చట్టం లోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణ అర్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని కోర్టు పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హతఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది.
హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పైగా చింతాడ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవం ఉన్నారని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.