
మంత్రి పదవి ఉన్నా లేకున్నా తన బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని కెసి వేణుగోపాల్ చెప్పారని ఆయన తెలిపారు. ఆ హామీ ఇప్పటికీ ఉందన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనడం భావ్యం కాదన్నారు.
ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేప్పుడు తెలియదా తాము అన్నదమ్ములమని అని ఆయన ప్రశ్నించారు. తమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రానంత మాత్రాన తన బ్రాండ్ ఇమేజ్ ఇలాగే ఉంటుందన్నారు. మంత్రి పదవి వచ్చినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మార్పు ఏమీ ఉండదని ఆయన తెలిపారు. మంత్రి పదవి కోసం పాకులాడడం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.