
రాష్ట్రంలో గ్యాస్ కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు, వృద్ధాశ్రమాలు,హాస్టళ్లు, హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సకాలంలో గ్యాస్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేందుకు శాసనసభ, శాసన మండలిలో దీనిపై తక్షణమే చర్చ జరగాలని మంగళవారం బిఆర్‌ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు గన్‌పార్క్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆపండి వెంటనే గ్యాస్ ఇవ్వండి..కేంద్ర చెబుతోంది కొరత లేదు, రాష్ట్ర చెబుతుఓంది సప్లై లేదు..ఏదీ నిజం..? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ నిరసనలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మదుసూదనాచారితో పాటు పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు
సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి డిస్టిబ్యూషన్ దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున్న క్యూ లైన్‌లో ఉంటున్నారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత లేదు..సరిపడా నిల్వలు ఉన్నాయి అని కేంద్రం చెబుతుది..పెట్రోలియం, గ్యాస్ కేంద్ర పరిధిలో ఉన్నాయి, గ్యాస్ కొరత ఉందని రాష్ట్రం చెబుతుందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి కేంద్రం సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతుందని, 14 కిలోల సిలిండర్‌ను 10 కిలోలు కాబోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇరాన్‌లో ఇబ్బంది ఉంటే వేరే చోట నుండి తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఇంట్లో సిలిండర్ల గురించి చర్చ జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై శాసనసభలో, శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో మాట్లాడుతామని తెలిపారు.