Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను దివ్యాంగులు కలిశారు. రేపు చేపట్టనున్న వికలాంగుల దీక్షకు రావాలని కెటిఆర్ ను కోరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగుల సైతం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి వచ్చిందని, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని సిఎం రేవంత్ సర్కార్ మాట తప్పిందని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గంగలో కలిసిపోయిందని, నెల నెలా వచ్చే పెన్షన్ కూడా దివ్యాంగులకు సమాయానికి అందడంలేదని మండిపడ్డారు. దివ్యాంగుల సంక్షేమానికి బిఆర్ఎస్ హయాంలో ఎంతో కృషి చేశామని తెలియజేశారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని, దివ్యాంగుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చే వరకు పోరాడుతామని అన్నారు. రేపు దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.