
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారంగా ప్రారంభ మ్యాచులకు దూరం కాగా.. తాజాగా జాక్ ఎడ్వర్డ్స్ వైదొలగాల్సి వచ్చింది. గాయం కారణంగా అతను IPL 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జాక్ ను ఎస్ఆర్ హెచ్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతని స్థానంలో 35 ఏళ్ల ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పేన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
పేన్.. ఇంగ్లాండ్ తరపున కేవలం ఒక వన్డే (ODI) మాత్రమే ఆడినప్పటికీ, రూ. 1.5 కోట్లకు SRH జట్టులో చేరడం విశేషం. అయితే, పేన్ టీ20 ఫార్మాట్లో అత్యున్నత ప్రదర్శనే చేశాడు. T20 క్రికెట్ ఆడిన అపారమైన అనుభవం అతనికి ఉంది.పేన్, తన కెరీర్‌లో ఇప్పటివరకు అతను 233 T20 మ్యాచ్‌లు ఆడి.. 8.03 ఎకానమీ రేటుతో మొత్తం 304 వికెట్లు పడగొట్టాడు.
ఇటీవల జరిగిన BBL (Big Bash League) 15 సీజన్‌లో పేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన ‘పెర్త్ స్కార్చర్స్’ జట్టులో డేవిడ్ పేన్ కీలక బౌలర్ గా ఉన్నాడు. ఆడిన ఆరు మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేన్.. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. BBLలో చూపిన ఇదే ఫామ్‌ను IPLలో SRH తరపున కూడా పునరావృతం చేయాలని పేన్ ఆశిస్తున్నాడు. దీంతో సరైన బౌలింగ్ లేక ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ కు పేన్ కీలకం కానున్నాడు. ఇక, కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ SRH జట్టుకు నాయకత్వం వహిస్తాడు.