Reading Time: < 1 minute

ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై మోడీ ప్రసంగించారు. ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తోందని తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చామని, భారత్ కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని అన్నారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అని మోడీ కొనియాడారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు పనిచేస్తున్నారని, ఇప్పుడు వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని ఇది ఆందోళనకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి వచ్చారని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని సూచించారు. గృహావసరాలకు సంబంధించి ఎల్పిజి సరఫరాను పెంచుతున్నామని, 41 దేశాల నుంచి మనం పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం మన దగ్గర 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయని, మనకు గల్ఫ్ నుంచి ఎక్కువగా చమురు, గ్యాస్ వస్తోందని అన్నారు. గల్ప్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని, దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని, కావాల్సినంత గ్యాస్, పెట్రోల్ అందుబాటులో ఉంది అని అన్నారు. ఈ సభ ద్వారా మనం ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని వినిపించాలని మోడీ కోరారు.