Reading Time: 3 minutes

యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తెలంగాణలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతద్వారా నగరంలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి ఎక్కడ రద్దీఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా నియంత్రించి వాహనాల రాకపోకలు సుగమం చేయడానికి వీలవుతుంది. రోడ్డు భద్రత మెరుగుపడడమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణలో ఎఐ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందో చర్చకు వచ్చింది. 2024లో దేశవ్యాప్తంగా 4,87,705 రోడ్డు ప్రమాదాలు జరగ్గా తెలంగాణలో 25,986 వరకు ప్రమాదాలు పెరిగాయని పెరిగాయి. తెలంగాణలో రోజుకు సగటున 70 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 20మంది వరకు మరణిస్తుండడం బాధాకరం.

దీనిలో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో మరణాలు సగటున 8000 వరకు ఉన్నాయని, సుమారు 15 వేల మంది తీవ్ర గాయాల పాలై కుటుంబానికి భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో హైవేల మీద జరిగే ప్రమాదాల్లో అధికశాతం.. రోడ్డుపక్కన ఆగి ఉన్న లేదా పాడైపోయిన వాహనాలను వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఎఐ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగపడతాయి. హైవే పై ఎక్కడైనా వాహనం నిలబడి ఉంటే వెంటనే ఇవి గుర్తిస్తాయి. కంట్రోల్ రూమ్ ద్వారా వెనుక వచ్చే వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు పంపుతాయి. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని అదుపు చేయడానికి వీలవుతుంది. చౌరస్తాలు, జంక్షన్లలో ఎఐ కెమెరాలు ఉపయోగించి వాహనాల మధ్య ఉండే దూరాన్ని, వాటి వేగాన్ని విశ్లేషిస్తారు. వాహనాలు ఎంత దగ్గరగా వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ ముప్పు పొంచి ఉందనే అంశాల ఆధారంగా ఒక మ్యాప్ రూపొందిస్తారు. ఇది ఆ జంక్షన్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో వాహనాలే వాటంతట అవే డ్రైవర్ అజాగ్రత్తగా ఉన్నా వెంటనే బ్రేక్‌వేసి ఆపడం లేదా దారి మార్చుకోవడం వంటివి ఎఐ వల్ల సాధ్యమవుతాయని చెబుతున్నారు.

ఎఐ కెమెరాలు, డ్రోన్లు మన రోడ్లపై పహారా కాస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందనడంలో సందేహం లేదు. పుణె వంటి నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థలు స్మార్ట్ కెమెరాలను వినియోగించడం ప్రారంభించాయి. డ్రైవర్లు మగతగా ఉన్నారా? పరధ్యానంలో ఉన్నారా? సిగ్నల్స్ దాటుకుని స్పీడుగా వెళ్తున్నారా? ఇలాంటి అపసవ్య విధానాలను ఈ స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. కెమెరాల నుంచి, స్టీరింగ్ నమూనాల నుంచి, బ్రేకుల ఒత్తిడినుంచి డేటా సేకరిస్తారు. అలాగే డ్రైవరు ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తున్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో, రెడ్‌లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఎలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడో తెలిసిపోతుంది. అలాంటి సమయాల్లో హెచ్చరికలు వస్తాయి. కొన్నిసార్లు కీచుమని శబ్దంరూపం లోనూ, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారానూ హెచ్చరికలు వస్తుంటాయి. డ్రైవర్ల జీవితం ఎక్కువగా రోడ్లపైనే సాగుతుంది. ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది.

ఎప్పుడు కళ్లు మత్తుతోపడినా లేదా సిగ్నల్స్‌కకు స్పందించే సమయం జారిపోయినా, విపత్తును పసిగట్టి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు హెచ్చరిస్తుంది. ఓవర్ స్పీడ్‌తో వాహనం వెళ్తున్నప్పుడు స్వయం చాలకంగా నియంత్రించడం, ముందున్న వాహనానికి, ఈ వాహనానికి మధ్య దూరాన్ని గమనించి అవసరాన్ని బట్టి వేగాన్ని తగ్గించటం లేదా పెంచడం చేస్తుంది. డ్రైవర్లు ఒత్తిడికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండేవరకు ఏకాగ్రతను పెంచుతుంది. దేశంలో బస్సుల్లో డ్రైవర్లకు సహాయక హెచ్చరికల పైలట్ ప్రణాళికలను కొన్నిచోట్ల అమలు చేయగా, ప్రమాదాలు చాలావరకు తగ్గాయని తేలింది. రవాణా వ్యవస్థలో కృత్రిమమేధ సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఏమంత కష్టం కాదు. ఇటీవల కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకురావడం చెప్పుకోతగిన విశేషం. దీంతో దేశంలోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది.

రోడ్డు భద్రత యాజమాన్య వ్యవస్థలో సాంకేతికత కీలకమైన పాత్ర వహిస్తుందని రోడ్ రవాణా, జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ (ఎంఒఆర్‌టిహెచ్) భాగస్వామ్య సంస్థ జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సూచించింది. రోడ్డు భద్రతను మరింత పెంచడానికి ఐఆర్‌ఎడి/ ఇడిఎఆర్ వంటి డిజిటల్ వ్యవస్థలను సరిగ్గా వినియోగించకపోవడంతో సమగ్రంగా ట్రాఫిక్ నిర్వహించడం కానీ, ప్రమాదాలను అదుపు చేయడం కానీ జరగడం లేదనీ నివేదిక పేర్కొంది. వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల్లో 90% మానవ ప్రమేయం వల్లనే జరుగుతున్నాయని 2022 లోని రోడ్డు భద్రత నివేదిక వెల్లడించడం గమనార్హం. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి. పట్టాభిరామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వెలిబుచ్చడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఈ ప్రమాదాలను నివారించాలంటే ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పదేపదే హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థల సాయం తీసుకుంటేనే కానీ ఈ ప్రమాదాల నివారణ అంతగా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

– కె.యాదగిరిరెడ్డి

98667 89511