
ఒక సమాజం సాధించే ప్రగతికి, వ్యక్తిత్వ వికాసానికి విద్య అనేది పునాది వంటిది. విద్య కేవలం అక్షరాస్యతను పెంచడమే కాకుండా, విచక్షణ జ్ఞానాన్ని అందించి మనిషిని సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య అతిపెద్ద ఆయుధం. మూఢ నమ్మకాలను తొలగించి, లింగ వివక్షలేని సమానత్వ సమాజాన్ని నిర్మించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో కొత్త పరిశోధనలకు, అద్భుతమైన ఆవిష్కరణలకు విద్యాక్షేత్రాలే వేదికలు. క్రమశిక్షణ, నైతిక విలువలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విద్యా రంగం అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌లో తగినంత నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా అనేక కమిషను, జాతీయ విద్యా విధానాలు సిఫార్సు చేస్తూనే ఉన్నాయి.
కొఠారి కమిషన్ (1964 -66) దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో కనీసం 6% విద్యకు కేటాయించాలని సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి2020) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యా రంగానికి చేసే ప్రభుత్వ వ్యయాన్ని జిడిపిలో 6% కి చేర్చాలని స్పష్టంగా పేర్కొంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18% నిధులను విద్యా రంగానికి కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు విద్యా బడ్జెట్ కేటాయింపులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2014- 15లో రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది బడ్జెట్‌లో విద్యకు అత్యధికంగా 10.89% కేటాయించారు. అయితే, ఆ తర్వాత ఏళ్లలో ఈ శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2023 -24 నాటికి ఇది 6.5% కనిష్ట స్థాయికి చేరుకుంది. గత రెండేళ్లుగా కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. 2024- 25లో 7.7%, 2025- 26లో 7.9% నిధులు కేటాయించారు. తాజాగా 2026- 27 బడ్జెట్‌లో రూ. 26,674 కోట్లను (8.22%) కేటాయించడం గమనార్హం.
గత దశాబ్దకాలంలో మొత్తం బడ్జెట్ పరిమాణం సుమారు 200% పెరిగినప్పటికీ, విద్యారంగ కేటాయింపులు మాత్రం దాదాపు 126% మాత్రమే పెరిగాయి. 2026 -27 తెలంగాణ బడ్జెట్‌లో విద్యాశాఖకు చేసిన కేటాయింపులు, విద్యా ప్రాధాన్యతకు తగినట్లు ఉన్నాయా లేదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం దీనిని ‘విద్యా బడ్జెట్’గా అభివర్ణిస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు రూ. 26,674 కోట్లకు పెరిగాయి. ఇది గత బడ్జెట్ కంటే దాదాపు 15% ఎక్కువ. ఉస్మానియా వంటి పురాతన యూనివర్శిటీలకు, మహిళా యూనివర్శిటీలకు భారీగా నిధులు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’, ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యం కనిపిస్తోంది. కానీ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో విద్య వాటా కేవలం 8.22% మాత్రమే. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు ఇస్తున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న వేల సంఖ్యలోని జిల్లా పరిషత్ (జడ్‌పిహెచ్‌ఎస్), ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు (మరుగుదొడ్లు, తాగునీరు) కల్పించడానికి కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో వేల సంఖ్య లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిఎస్‌సి ద్వారా కొత్త నియామకాలు, కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణ వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో స్పష్టమైన ఆర్థిక భరోసా కనిపించడం లేదు. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో సూచించిన అంశాలకు, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. కమిషన్ కోరినది 18% బడ్జెట్ వాటా. అయితే ప్రభుత్వం ఇచ్చింది 8.22% బడ్జెట్ వాటా మాత్రమే. ప్రభుత్వం విద్యపై ‘దృష్టి’ పెట్టిందన్నది వాస్తవం. కానీ అది ‘పూర్తి స్థాయి ప్రాధాన్యత’గా మారలేదు. కేటాయింపులు పెరిగినప్పటికీ, అవి పెరిగిన అవసరాలకు సరిపోవు. ముఖ్యంగా సామాన్య విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరిన్ని నిధులు అవసరం. తెలంగాణ (8.23%)తో పోలిస్తే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యకు తమ బడ్జెట్‌లో చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్‌లో సుమారు 22% నుండి 25% నిధులను కేటాయిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. బీహార్: 18% -19%, చత్తీస్‌గఢ్: 18%, అసోం: 15%16%, ఆంధ్రప్రదేశ్: 12% 13% నిధులను కేటాయిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు సగటున 14% నుండి 15% వరకు కేటాయిస్తుండగా, తెలంగాణ కేటాయింపులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
ఢిల్లీ వంటి రాష్ట్రాలు మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణపై పెట్టిన పెట్టుబడి వల్ల అక్కడి ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దేశవ్యాప్త సగటు ప్రస్తుతం జిడిపిలో 4.1% – 4.6% మధ్య ఉండగా, తెలంగాణలో ఇది ఇంకా తక్కువగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్‌లో 15% నిధులను విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ప్రస్తుత కేటాయింపు (8.23%) ఆ హామీలో సగం మాత్రమే. విద్యారంగ కేటాయింపులు ఖర్చు కాదు, భవిష్యత్తుపై పెట్టుబడి. సాధారణంగా ప్రభుత్వం చేసే ఖర్చులను అనుత్పాదక వ్యయాలుగా భావిస్తారు. కానీ విద్యారంగంపై చేసే ఖర్చు మాత్రం దేశ భవిష్యత్తును నిర్మించే అత్యుత్తమ పెట్టుబడి. భౌతిక వనరుల కంటే మానవ వనరులే ఒక దేశానికి అసలైన సంపద. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు తయారవుతారు. విద్యపై పెట్టే ప్రతి రూపాయి పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది పేదరికాన్ని తగ్గించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించడంద్వారా సామాజిక రుగ్మతలు తగ్గుతాయి. అందుకే, బడ్జెట్‌లో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను కేవలం అంకెల్లో చూడకూడదు; అది రాబోయే తరాల అభివృద్ధికి వేసే పునాదిగా గుర్తించాలి.
– జె నారాయణయాదవ్
94940 19270