
తెలంగాణ ఏర్పడి బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల లోపు ఉండేదని, బిఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.36 వేల కోట్లు అయ్యిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.2 వేల కోట్లు తగ్గిందని ఆయన చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించింది ఎవరు?, తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో ఈ లెక్కలను చూస్తే తెలిసిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.65 వేల కోట్లకు మించలేదని
బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్లకు చేరిందని ఆయన అన్నారు. పదేళ్లలో ఎక్సైజ్‌శాఖ ఆదాయం పెరిగిందని మంత్రి జూప ల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,941 కోట్ల్ల ఎక్సైజ్ ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు, గత సంవత్సరం కంటే దాదాపు రూ.12 వేల కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు, అంత ఆదాయం రావాలంటే రూ.25 వేల కోట్ల మద్యం అమ్మాలి, ఏకంగా 35 శాతం ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్నారంటే, గల్లీకొక బెల్టు షాపు పెడతారా అని మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించడంతో ఆయనకు కౌంటర్‌గా మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు.