
పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతికి కూడా నోటీసు జారీ చేసింది. 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తాము ఇదివరకే అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా,
పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ కేసు కొట్టి వేశారని పిటిషనర్ ఏలేటి తరఫున న్యాయవాది తన వాదన వినిపించారు. స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరుకాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉంటూ స్పీకర్ తరపున ఎలా వాదిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ సీనియర్ న్యాయవాదిగా వాదించాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి చెబుతూ కేసును వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు.