
క్యూ నెట్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ పలువురు అమాయకులను మోసం చేస్తున్న 32మందిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రంలో దాడులు చేసిన పోలీసులు విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న వారిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని సిసిఎస్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 30 బృందాలుగా ఏర్పడి అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో 11 మంది మహిళలతోపాటు 32 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నిందితులు నాలుగు కేసులలో 11 మంది బాధితుల నుండి సుమారు 75 లక్షల రూపాయలు వసూలు చేశారు. గతంలో గోల్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ అని పిలవబడే ఈ సంస్థ, హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూ ఐ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ.
ఈ సంస్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతోంది. కమీషన్, విదేశాల ట్రిప్పుల పేరుతో పలువురిని ఇందులో చేర్చుకుంటోంది. చేరిన వారు మరికొంత మందిని చేర్చాలని, భారీగా కమీషన్ వస్తుందని, విదేశాలకు వెళ్లవచ్చని, కార్లు గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. క్యూ నెట్ నిందితులు హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ-కామర్స్ వ్యాపారం, పెట్టుబడుల పేరుతో పలువురు బాధితులకు వలవేశారు. రూ. 5 నుండి 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే, రెండేళ్లలో రూ. 3 నుండి 4 కోట్ల రూపాయల లాభం వస్తుందని నమ్మిస్తారు. ప్రారంభంలో వీరు క్యూ నెట్ పేరును కానీ, ఇది మల్టీ లెవల్ మార్కెటింగ్, బైనరీ పద్ధతి అని ఎక్కడా చెప్పరు. బాధితులు డబ్బు చెల్లించిన తర్వాత, వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్ళిస్తారు. ఇంటికి వస్తువులు వచ్చినప్పుడు, అవి కంపెనీ ఇచ్చిన బహుమతులని నమ్మిస్తూ అసలు పెట్టుబడిని పథకంలోకి మారుస్తున్నారు.