
గత వానకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి రైతులకు రావాల్సిన దాదాపు రూ. 19,000 కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని హరీష్‌రావు ఆరోపించారు. కుడి చేత్తో రైతుబంధు నిధులను లాగేసుకొని, ఎడమచేత్తో రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని ఆయన విమర్శించారు. కెసిఆర్‌ది ‘పెట్టుబడి సాయం’ పథకమైతే, కాంగ్రెస్ ది ‘ఎన్నికల పెట్టుబడి సాయం’ అని ఎద్దేవా చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, దానిని కేవలం సన్న రకాలకే పరిమితం చేశారని, అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా’ పథకం కింద రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని బడ్జెట్‌లో రూ. 1,300 కోట్లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకు కూడా బీమా అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000లు ఇస్తామని ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో గొప్పగా ప్రకటించి, రెండు బడ్జెట్లు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని నిరుపేద కూలీల కడుపు కొట్టడం ధర్మమేనా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, తాజా బడ్జెట్‌లో ‘జాబ్ క్యాలండర్’ ప్రస్తావనే లేకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న అశోక్ నగర్ అభ్యర్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు.