Reading Time: < 1 minute

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆటోలో అసెంబ్లీ వద్దకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి సాయంత్రం విడుదల చేశారు.సోమవారం ఉదయం11.30 గంటల సమయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో అసెంబ్లీకి నలువైపులా వస్తూ ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ముట్టడికి బిజెపి శ్రేణులు వస్తున్నారన్న విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి నాయకత్వంలో కొంత మంది కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకుని రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అదే సమయంలో ఇతర మార్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు దూసుకుని రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.

కార్యకర్తలు దూసుకుని రావడం, ఆ ప్రాంత మంతా ఉద్రిక్తతకు దారి తీసి, ట్రాఫిక్‌కు కొంత సమయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి, అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు భరోసా చెల్లించడం లేదని, దాదాపు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పలు విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. అర్ధరాత్రి నుంచే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. సుమారు ఎనిమిది వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారని రాంచందర్ రావు చెప్పారు.