
రైతులకు పూర్తి రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం వంటి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని వివరించారు. ఈ కేపిసి కింద రూ. 3 లక్షల వరకు పంట రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నట్టు చెప్పారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్‌ఎస్) కింద సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్టు గుర్తు చేశారు.
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ ) జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాల మార్గదర్శకాల ప్రకారం అనుబంధ కార్యకలాపాల రుణాలతోసహా పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే వ్యవసాయంతో సహా ఆర్థిక వ్యవస్థ లోని ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. వీటితోపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్ )పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీతోపాటు పంటలబీమా అందిస్తున్నామని పేర్కొన్నారు.