
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఓ కోల్డ్ స్టోరేజ్ కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళం, పోలీసులతో సహా పలు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏడీఎం ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది 24 నుంచి 48 గంటల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశఆరు. మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 అందజేయనున్నారు.
అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని యోగి, అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసేందుకు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించారు.