Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయమని ట్రంప్ తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకూ దాడులు చేయమని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చలు సానుకూలంగా ఉన్నాయని.. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. చర్చల ఫలితంపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు.

అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం స్పందించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్ మరోసారి దిగివచ్చారని ఇరాన్ అన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తమ హెచ్చరికలతో ట్రంప్ దిగివచ్చారని ఇరాన్ తెలిపింది. ట్రంప్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొంది. చర్చల ప్రతిపాదనను తాము తిరస్కరించామని.. చమురు ధరల తగ్గింపు కోసమే ట్రంప్ నాటకాలు అని తెలిపింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని.. అసలు చొరవ తీసుకోవాల్సింది.. యుద్ధం ప్రారంభించిన దేశమని ఇరాన్ స్పష్టం చేసింది.