
బిఆర్‌ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో, ఏం ఇచ్చారో చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్‌రావును ప్రశ్నించారు. అసెంబ్లీలో మాజీమంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఢిల్లీ పాయే జాబులేమో రాకపాయే అంటూ అశోక్ నగర్ లాఠీచార్జీలను హరీశ్‌రావు గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్లకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనానని మంత్రి ప్రశ్నించారు. పాండవులు సంపాదించింది అంత కౌరవుల తద్దినానికే సరిపోయిందన్నట్లుగా గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. ఇచ్చిన హామీల ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని సీతక్క చెప్పారు. హరీశ్ రావు నీ నియోజకవర్గానికి 50 శాతం రైతు రుణమాఫీ కాలేదంటున్నారని,
మరి మీ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని, మీరు అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఇబ్బంది ఉండకపోయేది కదా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏం చేశారో లెక్కలతో సహా చెప్పాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో చాలా మంది రైతులు చనిపోయారు, మీ బాధ అంత అధికారం పోయిందని హరీష్ అన్న, మేము చేస్తున్న వాటిలో మన్ను పోసి మీరు గొప్ప అని చెప్పుకోవడం కాదని, సీట్ మారినంత మాత్రాన చరిత్ర మారుతుందా? పదేళ్లు అంటే చాలా సమయం ప్రజలు ఇచ్చారని, ఎందుకు మీరు చేయలేదని, మీ అప్పులకి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలే సరిపోతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా పెడితే ఓర్వ లేకపోతున్నారని, మట్టి, దుమ్ము పోసుడు రాజకీయం కాదని, ముందు మీరు చేసింది చెప్పాలని, తాము ఏం చేయాలో చెప్పాలని మంత్రి సీతక్క హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.