
“రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే..” అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ రెడ్డి తప్ప పవర్ పుల్ దమ్మున్న నాయకుడు మరొకరు లేరని రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో చెప్పానని ఆయన సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మీకు తన మాటలపై నమ్మకం లేకపోతే ఆ వీడియో చూపిస్తానని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. ఎవరు అవునన్నా కాదన్నా తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని ఆయన చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ తనదేనని అన్నారు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తనను నటించమని అడిగితే నిరాకరించానని ఆయన తెలిపారు. ఎందుకు నిరాకరించారని ప్రశ్నించగా, అలాంటి పాత్ర కాదు ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని ఉందన్నారు. వెండి తెరపై ముఖ్యమంత్రి పాత్ర పోషించడానికి అవకాశం వస్తే తప్పకుండా పోషిస్తానని సి. మల్లా రెడ్డి తెలిపారు.