Reading Time: < 1 minute

గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల వయస్సులోనే ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జరిగిన ఐపిఎల్ సీజన్‌లో వేగవంతమైన సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత భారత యువ జట్టు తరఫున కూడా పలు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ 19వ సీజన్‌లో చాలా మంది దృష్టి వైభవ్‌ పైనే ఉంది. ఈసారి వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే వైభవ్ సూర్యవంశీపై ఆర్‌సిబి ఆటగాడు జితేశ్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్‌తో యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన జితేశ్.. వైభవ్‌ని అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ చక్కటి ఆటగాడు. అండర్-19 జట్టులో అతడి ఆట చూశాను. నిలకడగా రాణించడం సాధారణ విషయం కాదు. అండర్-19 ప్రపంచకప్‌లో అతడి ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తన వయసు కన్నా ఎంతో పరిణితిని సాధించాడు’’ అని జితేశ్ అన్నాడు.

‘‘అతడు తన గేమ్ ప్లాన్‌ను అనుసరించి ఆడాడు. ఐపిఎల్‌లో ఎలా రాణించాడో దాన్నే కొనసాగించాడు. మరొకరిని అనుకరించలేదు. బౌలర్లతో దురుసుగా ప్రవర్తించలేదు. వైభవ్ భవిష్యత్తులో ప్రొఫెషనల్‌గా మారుతాడు. ప్రస్తుతానికైతే అతడు ప్రొఫెషనల్ కాదు (నవ్వుతూ). అందరూ అతడిని ప్రొఫెషనల్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వైభవ్ ఎప్పటికీ అలానే ఉంటాడని నేను అనుకోవడం లేదు. నేను కూడా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నా. రాత్రిపూట ఐస్‌క్రీం తినొద్దు అని అతడికి నేను చాలాసార్లు చెప్పి చూశాను. అయినా ఎప్పుడు నా మాట వినలేదు’’ అని జితేశ్ వివరించాడు.