Reading Time: < 1 minute

‘ధురందర్ ది రివెంజ్’ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టను ఆశ్రయించారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, తమిళనాడులో ‘ధురందర్ 2’ సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది.

 ఓ న్యాయవాది.. ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ఎదుట మౌఖికంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తాలతో కూడుకున్నదని, ఎన్నికల సమయంలో దీనిని ప్రదర్శించకూడదని ఆయన వాదించారు.  అయితే, పిటిషనర్ అధికారికంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఈ విషయంపై అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తర్వాతే, సినిమా విడుదలను నిలిపివేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

కాగా, ‘ధురందర్ ది రివెంజ్’ చిత్రం కరాచీలోని ల్యారీ నేపథ్యంలో సాగుతుంది. ఈ ప్రాంతం తరచుగా గ్యాంగ్ ఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రం కల్పిత కథనంతో పాటు కాందహార్ హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి నిజ జీవిత సంఘటనలను కూడా ప్రస్తావించారు.

హీరో రణ్ వీర్ సింగ్ తోపాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కూడా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయంతో దూసుకుపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ.750 కోట్లకు పైగా వసూల్ చేసి.. రూ.వెయ్యి కోట్లవైపు పరుగులు పెడుతోంది.