
హైదరాబాద్: క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ మోసాలకు పాల్పడిన విషయం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్, ఎపి, కర్ణాటకల్లో 25 బృందాలతో సోదాలు నిర్వహించారు. తాజాగా సజ్జనార్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. క్యూనెట్‌పై తెలంగాణలో 68, హైదరాబాద్‌లో 22 కేసులు ఉన్నాయని.. ఇటీవల మరో 4 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్‌లో ఓ క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇన్‌కమ్ పేరుతో ఐటి ఉద్యోగులను ఆకర్షిస్తున్నారని అన్నారు. స్టార్ హోటళ్లలో మీటింగ్‌లు పెట్టి ఉత్పత్తులు అమ్మమంటున్నారని.. రుణాలు ఇప్పించి మరీ క్యూనెట్‌లో చేర్చుకుంటున్నారని తెలిపారు. కార్లు, ఇళ్లు చూపించి క్యూనెట్‌లోకి ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో ప్రముఖ ఐటి కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. మనీలాండరింగ్‌పై దర్యాప్తు కోసం ఇడిని కోరుతమని తెలిపారు.