
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తే.. ఆస్తులు గురించి మాట్లాడుతున్నారని ఎపిసిసి చీఫ్ షర్మిల తెలిపారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని.. అని అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తన పోరాటం, అజెండా ఆస్తులు కాదని, ఆస్తులే తన అజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానిని అని తెలియజేశారు. ఆస్తులపై తన తల్లి విజయమ్మ స్పష్టత ఇచ్చారని, లేఖ ద్వారా విజయమ్మ వాస్తవాలు చెప్పారని అన్నారు. స్పష్టత ఇచ్చినా వైసిపి నేతలు మొరుగుతున్నారని, విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు.
విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించానని ఆరోపిస్తున్నారని, ఒకవేళ తాను ఒత్తిడి చేస్తే.. ఈ సంతకం తనది కాదని విజయమ్మ చెప్పలేరా? అని ప్రశ్నించారు. విజయమ్మ లేఖ వాస్తవమని తెలుసు కాబట్టి జగన్ మాట్లాడలేరు అని.. జగన్ తన సైన్యంతో సోషల్ మీడియాలో మాట్లాడించడం ఎందుకు? అని.. జగన్ కు మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. సాక్షిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో.. సత్యమేవజయతే అని బ్యానర్ వేశారని, సాక్షిలో విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? అని ప్రశ్నించారు. విజయమ్మ లేఖ వేయకపోవడం బట్టే తెలుస్తోంది.. సత్యం పట్ల వారికున్న గౌరవం అని షర్మిల దుయ్యబట్టారు.