
చెన్నై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) సోమవారం సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ సీట్ల సర్దుబాటు జరిగింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఐఏడీఎంకే అత్యధికంగా 178 సీట్లను దక్కించుకుంది. ఇక, బిజెపికి 27 సీట్లు.. పట్టాలి మక్కల్ కచ్చి (PMK) పార్టీకి 18 సీట్లు.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) పార్టీకి 11 సీట్లు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటనే ఈసారి బిజెపికి ఏడు సీట్లు ఎక్కువగా ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. సీట్లు సర్దుబాటు అనంతరం BJP నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. “మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము అత్యంత బలమైన కూటమిని ఏర్పాటు చేశాం. మా కూటమి ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.