Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే SP పెన్షన్ పథకం కింద నిరుపేద మహిళలకు ఏటా రూ. 40,000 ఆర్థిక సహాయం అందిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. సోమవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వారికి మరింత స్వయంప్రతిపత్తిని కల్పించడంపై తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత లక్ష్యంగా గతంలో అమలులో ఉన్న పథకాలను తిరిగి ప్రారంభించడం, అలాగే కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

సమాజంలో మహిళలు ఒక కీలక భాగమని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వారి పురోగతి అత్యంత ముఖ్యమని యాదవ్ అన్నారు. మహిళలను గౌరవించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ‘రాణి లక్ష్మీబాయి’ వంటి గత పథకాలను తిరిగి తీసుకురావాలని తమ పార్టీ యోచిస్తోందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించే దిశగా కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుందని యాదవ్ పేర్కొన్నారు.