Reading Time: < 1 minute

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకత్వంపై ఈటెల మండిపడ్డారు. తాము పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదు అని, మా పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో అభ్యర్థులను తామే బరిలోకి దించుతామని, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాను ఇప్పటికే సర్వేలు చేశామని, మా అభ్యర్థులను తామే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో తనకు ఇప్పటికి సమాచారం లేదు అని, పార్టీ నిర్ణయాల్లో తనకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీనియర్ నేతగా తనకు ఒక గుర్తింపు ఉందని, దాన్ని పార్టీ కాపాడుకోవాలని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బిజెపి పార్టీ నేతలే ఉన్నారని, సొంత పార్టీ నేతలే తనపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిబిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను ఒక మతానికి కులానికి చెందిన వ్యక్తిని కాదు అని పేర్కొన్నారు.