
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఐపిఎల్ ట్రోఫీ సాధించేందుకు తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో రాణిస్తే చూడాలని ఉందని అశ్విన్ అన్నాడు. వైభవ్ విజృంభిస్తే.. రాజస్థాన్‌ను ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు.
‘ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో విజృంభిస్తే.. రాజస్థాన్‌ను ఆపడం ఎవరి తరం కాదు. అయితే అతడికిది కేవలం రెండో సీజన్ మాత్రమే. ఆ పిల్లవాడికి సరైన అనుభవమూ లేదు. కాబట్టి అతడి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు’’ అని అశ్విన్ అన్నాడు.
అయితే వైభవ్‌ను అడ్డుకొనేందుకు అన్ని జట్లు ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసి బరిలోకి దిగుతాయని అశ్విన్ విశ్లేషించాడు. ‘వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అండర్ 19 ప్రపంచకప్, గత ఐపిఎల్ సీజన్‌లో ఆడినట్లే ఈ సీజన్‌లో కూడా అతడు రాణిస్తే చూడాలని ఉంది. మొదటి బంతి నుంచే అతడు విధ్వంసం సృష్టించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సీజన్‌లో అతడిని కట్టడి చేసేందుకు ఇతర జట్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటాయి’ అని అశ్విన్ తెలిపాడు.