Reading Time: < 1 minute

హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే మెట్రోలు, ఎంఎంటిఎస్‌లు పెంచుకున్నామని వివరించారు. శాసన మండలిలో రేవంత్ ప్రసంగించారు. క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చేలా చేశారని ప్రశంసించారు హైదరాబాద్ చారిత్రక నగరం అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని తెలియజేశారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని, కాలుష్య వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని, రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని, మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ముందుకు రాలేదని, కేంద్ర ప్రభుత్వ నిబంధనతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు మెట్రోను స్వాధీనం చేసుకుందని తెలియజేశారు.

మెట్రోను మరో 76 కిలో మీటర్లకు విస్తరిస్తామని, నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య భాగా పెరిగిందని, మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల కోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నామని, పైన విమానాలు ఎగిరితే కింద అండర్ టన్నెల్ వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  మూసీ నదీ ప్రక్షాళన మనకు అత్యవసరంగా మారిందని, గుజరాత్ అభివృద్ధిలో బిజెపికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, అభివృద్ధి విషయంలో అన్ని పార్టీల నేతలు ఒక్కటవ్వాలని సూచించారు. మూసీ నదిలో నల్లగొండ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పనులు చేయనివ్వం, ఆపేస్తాం అని మాత్రం అనవద్దని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో రోడ్ల విస్తరణఖు అనేక ఇబ్బందులు ఉన్నాయని, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, చిరు వ్యాపారులకు ఇతర చోట్ల స్థలం కేటాయిస్తున్నామని వివరించారు.