
స్వదేశానికి రావడానికి తెలుగు టెక్కీలు, ఎన్నారైలు తీవ్ర ఇబ్బందులు
మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరల పెరుగుదల, ఎయిర్ స్పేస్ పరిమితులతో హైద రాబాద్‌తో సహా భారత్‌కు వచ్చే విమాన టికెట్ ధరలు 40-60 శాతం వరకు పెరిగాయి. లండన్-హైదరాబాద్ రూట్‌లో ధరలు రూ. 2.5 లక్ష లకు చేరాయి. 5,500 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి, దీంతో తెలుగు టెక్కీలు, ఎన్నారైలు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాల్సి రావడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆందోళన: అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇండియాకు వెళ్లలేని స్థితి నెలకొందని, సెలవులు దొరికినా విమానం దొరకడం, ధరలు భరించడం కష్టంగా మారిందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి.
ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్‌గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే టూ వే టికెట్ ధరలు సంస్థలు వసూలు చేస్తున్నాయి . ఎయిర్ ఇండియా, ఎతిహాద్. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి.
అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్‌కు పోతుందో యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి.
విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం …!
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరల ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రతి నెలా మొదటి తేదీన ఎటిఎఫ్ ధరలు సవరించబడుతాయి. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం విమానయాన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం వరకు ఎటిఎఫ్ ఖర్చే ఉంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల ఈ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైంది.
ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి పలు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు సురక్షితంగా కొనసాగడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎటిఎఫ్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అయితే పెరిగిన ఇంధన ఖర్చులను సమతుల్యం చేసేందుకు విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను విధిస్తాయి. ఇది టిక్కెట్ బేస్ ఫేర్‌కు అదనంగా వసూలు చేయబడుతుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీని ప్రభావం భారతదేశంలో విమాన ప్రయాణ ఖర్చులపై పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, విమానయాన సంస్థలు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.