
కీలకశాఖల మంత్రులపై ప్రధాని మోడీ సమీక్ష
విద్యుత్ , పరిశ్రమలు, ఎరువులపై ప్రభావం విశ్లేషణ
ఎల్‌పిజి, కమర్షియల్ ఇంధన విషయాలపై బేరీజు
పోర్టుల్లో పరిస్థితి, దిగుమతుల్లో ఆటంకాలపై దృష్టి
న్యూఢిల్లీ ః పశ్చిమాసియా ఘర్షణ తీవ్రస్థాయికి చేరుతూ, చమురు సంక్షోభానికి దారితీస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పరిస్థితిని సమీక్షించారు. ఆయన దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ఇతరులు, పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్, దేశానికి ఇతర దేశాల నుంచి అందుతున్న ముడిచమురు వంటి అనేక అంశాలపై వారితో చర్చించారు. విద్యుత్ రంగం, ఎరువుల కర్మాగారాలపై పడుతున్న ప్రభావం, తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఇంధన సరఫరా నిరంతరాయంగా జరగాల్సి ఉంది. సరఫరాల స్థిరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ప్రధాని సూచించారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్, జెపి నడ్డా, పియూష్ గోయల్ పాల్గొన్నారు.
తమ మంత్రిత్వశాఖల నుంచి అభిప్రాయాలను తెలిపారు. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా సమస్య తలెత్తడంతో కేంద్ర రేవులు, నౌకాయాన మంత్రి సర్బనందా సోనోవాల్, ఇంధన మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ , కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రి ప్రహ్లాద్ జోషీతో చర్చించారు. వైమానిక రంగ సమస్యలు, విమానాల రాకపోకలను ప్రధానికి సంబంధిత మంత్రి కింజారపు రామ్మోహన నాయుడు తెలిపారు. దేశంలో పెట్కోలు, డీజిల్ పరిస్థితిని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలియచేశారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శులు ఇద్దరు పికె మిశ్రా, శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు.
పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పుడు జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత గల అత్యయిక సమీక్షా సమావేశం అయింది. కీలక ఇంధన సమస్యతో దేశవ్యాప్తంగా పరిశ్రమలపై పడుతున్న ప్రభావం ప్రస్తావనకు వచ్చింది. దేశంలో ప్రతి ఇంటికి అత్యవసరం అయిన వంటగ్యాసు, వాహనదారులకు, పరిశ్రమలకు కీలకమైన పెట్రోలు డీజిల్ ,కమర్షియల్ గ్యాస్ వంటి విషయాలు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు మరింతగా కమర్షియల్ గ్యాస్ కోటా అందించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లు, ఆసుపత్రులకు ఇతర అత్యవసర రంగం కేంద్రాలకు సరఫరా నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని సంకల్పించారు. దేశంలో రేవుల వద్ద పరిస్థితి సవ్యంగానే ఉందని అధికారులు తెలిపారు.