
న్యూఢిల్లీ: కొందరు విదేశీ ఆటగాళ్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పిఎస్ఎల్) వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సదరు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి నిమిషంలో పిఎస్ఎల్ వదిలి ఐపిఎల్ కు మారిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హెచ్చారించారు. ఐపీఎల్‌కు రెండు రోజుల ముందు, అంటే మార్చి 26న పీఎస్ఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ను కాదని, డబ్బులు బాగా వచ్చే భారత లీగ్‌ను ఎంచుకున్నారు.
ఈ సీజన్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ, దాసున్ షనక వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు పిఎస్ఎల్‌ను కాదని ఐపిఎల్‌ను ఎంచుకున్నారు. దీంతో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వైదొలిగే అంతర్జాతీయ ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు. మీడియా సమావేశంలో నఖ్వీ “నిబంధనల ప్రకారం ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కూడా ఇలానే చేసిన కార్బిన్ బాష్‌పై పీఎస్ఎల్ నుంచి ఏడాది పాటు నిషేధం విధించడం జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది.
కాగా, ముజరబానీ, దాసున్ షనక ఇద్దరితో పాటు గుడకేష్ మోతీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఒట్నీల్ బార్ట్‌మన్, స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ నుండి వైదొలిగిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారు.