Reading Time: 2 minutes

అవగాహనతో స్వీయ రక్షణ

మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దపీట

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆధునిక, సాంకేతిక యుగంలో సైతం మహిళల భద్రత కలవర పెడుతున్న అంశం. దీన్ని అధిగమించేందుకు మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ నూతన రీతిలో భద్రతకు సంబందించిన సంస్కరణలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం, ఉపాధి, కళాశాలకు వెళ్లే విద్యార్థినుల పనిచేసే చోట, ప్రయాణ సమయాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. పోలీస్ శాఖ ఇప్పటికే 100, 181, 1098 లాంటి టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినా మరి కొన్ని యాప్‌లతో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి.

టీ సేఫ్

టి- సేఫ్ అనే యాప్ రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం మహిళల ప్రయాణ భద్రత కోసం రూపోందించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం, రియల్ టైమ్ రైడ్ మానిటరింగ్ చేయడానికి ఈ యాప్ అభివృద్ధి చేశారు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. రాత్రి వేళ ఉద్యోగాలు చేసే మహిళలు, విధులు ఆలస్యమయిన సందర్భంలో, అర్దరాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించే వారికి యాప్‌తో భరోసా లభిస్తుంది. యాప్‌లో లాగిన్ అయిన తరువాత డయల్ 100 అనే ఆప్షన్‌లో మానిటరింగ్ ఎంపిక చేసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాం, ఏ వాహనంలో వెళుతున్నాం అనే వివరాలు నమోదు చేస్తే పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. ఎదయిన ఆపద వస్తే ఈ వివరాలతో పోలీసులు తక్షణమే సంబంధిత ప్రదేశానికి చేరుకుని బాధితులను రక్షిస్తారు.

మై సేఫ్టీ పిన్

మై సేఫ్టీ పిన్ యాప్ రాత్రి సమయాల్లో, కొత్త ప్రదేశాల్లో ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళలకు రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. ఈ యాప్‌తో రాత్రి సమయాల్లో ప్రయాణించే మార్గం ఎంత సురక్షితమో తెలుసుకోవచ్చు. వెలుతురు, జనసాంద్రత, ప్రజల రాకపోకలు వంటి ఆధారంగా రహదారి వివరాలు, ఎంత సురక్షితమో తెలుపుతుంది. లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రయాణ మార్గాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ నొక్కడం ద్వారా సమీపంలోని పోలీసులకు సమాచారం వెళుతుంది.

112(112 ఇండియా)

112 ఇండియా అనేది రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ఇఆర్‌ఎస్‌ఎస్) యాప్ కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలల భద్రత కోసం పనిచేసే ప్లాట్ ఫారమ్‌గా పనిచేస్తుంది. దీనికి వినియోగించడం ద్వారా మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ప్రయాణ సమయంలో ఏదయినా సమస్య తలెత్తినప్పుడు యాప్‌లోని ప్యానిక్ బటన్ నొక్కిగానే వెంటనే సదరు మహిళ ఉన్న లోకేషన్, వ్యక్తిగత సమాచారం(పేరు, వయస్సు, ఎమర్జెన్సీ కాంటాక్ట్) కంట్రోల్ రూంకు పంపుతుంది. దీంతో వేగంగా పోలీస్ శాఖ సహాయం అందుతుంది.