Reading Time: < 1 minute

ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడి

తెలంగాణ పరువు తీయకండి

మాజీ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కళ్ల ముందున్న సంస్థల పైనా సిఎంకు క్లారిటీ లేదా..? అని ప్రశ్నించారు. కనీస వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ప్రాథమిక అవగాహన లేకుండా తెలంగాణ పరువు తీయకండి అంటూ చురకలంటించారు. పటాన్‌చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్.. ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు అని, ఇది సిజిఐఎఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని తెలిపారు.

దీని ఏర్పాటులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఎఒ), యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యుఎన్‌డిపి), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక ఇది అని, దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణమని అన్నారు. ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్‌రావు హితవు పలికారు.