Reading Time: < 1 minute

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18న తాను స్థానిక బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డకు వెళ్లానని గుర్తు చేశారు. అంతకు ముందురోజే మీడియాతో ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బి)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారని చెప్పారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనేనని మండిపడ్డారు.