Reading Time: < 1 minute

టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ చరిత్ర సృష్టించింది. మార్చి 22, ఆదివారం వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 31 పరుగులతో కెర్.. పురుషుల, మహిళల టీ20 క్రికెట్‌లో ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. ఈ పొట్టి అంతర్జాతీయ ఫార్మాట్‌లో ఆమె వరుసగా 30కి పైగా పరుగులు చేయడం ఇది 10వ సారి. మహిళల, పురుషుల టీ20లలోనే అత్యధిక సార్లు.. 30కి పైగా స్కోరు చేసి బ్యాటర్ గా కెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఇంతకుముందు వరుసగా తొమ్మిది సార్లు 30కి పైగా పరుగులు చేసిన శ్రీలంకకు ప్లేయర్ చమరి అథపత్తు, రొమేనియాకు చెందిన రెబెక్కా బ్లేక్‌ రికార్డును కెర్ బ్రేక్ చేసింది. ఇక, పురుషుల టీ20 క్రికెట్‌లో వరుసగా ఏడు సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన రికార్డు.. రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్, అభిషేక్ శర్మ, హ్రిస్టో లాకోవ్ పేరిట ఉంది.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అతిథి జట్టు దక్షిణాఫ్రికా 159/6 స్కోరు చేసింది. అన్నెరీ డెర్క్‌సెన్ 32 బంతుల్లో అజేయంగా 55 పరుగులతో రాణించింది. తర్వాత కివీస్ 160 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను న్యూజిలాండ్ 3-1తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.