Reading Time: < 1 minute

ట్రంప్ ఘాటు హెచ్చరిక.. ఇరాన్ బేఖాతరు

కైరో: హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదివారం ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు వెలువరించారు. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని పూర్తి స్థాయిలో రాకపోకలకు తిరిగి ప్రారంభించాల్సి ఉంది. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై అమెరికా దాడులకు దిగుతుందని ట్రంప్ తెలిపారు. దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయి. పలు ఇంధన కేంద్రాలను దెబ్బతీస్తామని తెలిపిన ట్రంప్ వీటిలో మొదటి దాడి అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని స్పందించారు. ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్‌కు చెందిన అతి పెద్ద బషేర్ అణు ఇంధన కేంద్రం, లేదా టెహరాన్‌కు దగ్గరిలోని సహజ వాయువు కేంద్రం దామావంద్‌పై దాడులు ఉంటాయని తెలిపారు.

తమ డెడ్‌లైన్ మేరకు ఇరాన్ స్పందించకపోతే తమ చర్యలు అత్యంత భయానకంగా ఉంటాయని ట్రంప్ తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ వెంటనే తిప్పికొట్టింది. ఆయన హెచ్చరికలకు జవాబు ఏమీ ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ప్రధాన నగరాలపై దాడులు చేసింది. ట్రంప్ 48 గంటల హర్మూజ్ గడువు, దీనిని ఇరాన్ బేఖాతరు చేయడంతో మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు మరింత ప్రమాదకర మలుపు తిరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. తమ అణు స్థావరాలపై ఎటువంటి దాడులు జరిగినా వీటికి స్పందనగా వెంటనే గల్ఫ్ దేశాల్లోని పలు చమురు కేంద్రాలు, క్షేత్రాలపై దాడులు జరుగుతాయని ఇరాన్ హెచ్చరించింది. తాము హర్మూజ్ జలసంధి మార్గంలో తమ దేశ శత్రు నౌకలు కాకుండా ఇతర నౌకలను అనుమతిస్తామని మరోసారి ఇరాన్ ఆదివారం తెలిపింది. ట్రంప్ ఘాటు హెచ్చరికల గురించి స్పందించకుండా ఈ విషయం తెలిపారు.