Reading Time: < 1 minute

విరామ లేకుండా 8931 రోజులు

సిక్కిం మాజీ సిఎం పికె చామ్లింగ్ రికార్డు అధిగమించిన ప్రధాని

కేంద్ర మంత్రుల ప్రశంసలు

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు నెలకొల్పారు. విరామం లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఆయన రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కిం సీఎం హోదాలో ఉన్నారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలతో అన్ని రోజుల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు.

అంతేకాదు గుజరాత్‌కు అత్యధిక కాలం సిఎంగా ఉన్న రికార్డు కూడా మోడీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీనే కావడం గమనార్హం. ఇక, ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా మోడీ పలు రికార్డులను నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోడీ నిలిచారు. అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోడీ నిలిచారు. తాజా రికార్డు నెలకొల్పిన మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర మంత్రలు అమిత్ షా, రాజ్‌నాథ్, పీయూష్ గోయల్, జెపి నడ్డా, అశ్విని వైష్ణవ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నేతృత్వంలో భారత నూతన మైలురాళ్లను నెలకొల్పుతుందన్నారు.