Reading Time: < 1 minute

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోడీ, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్‌ కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌, నిర్మలా సీతారామన్, హర్దీప్‌సింగ్‌ పూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. ఇంధన మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలన్న మోడీ సూచించారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సులభమైన లాజిస్టిక్స్, స్థిరమైన సరఫరా, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాయి. కొరతను నివారించడం, సేవలను స్థిరంగా ఉంచడం కీలక ప్రాధాన్యతలుగా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఏవైనా మార్పులు వస్తే వేగంగా స్పందించేందుకు నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపాయి